సిఎం జగన్మోహన్ రెడ్డి మనసులో నుంచి ఉద్భవించిన ఓ గొప్ప ఆలోచన సచివాలయ వ్యవస్థ! గ్రామ స్థాయి నుంచి పట్టణాలలో వార్డు స్థాయి వరకు ఎక్కడికక్కడ సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకువచ్చామని గొప్పగా చెప్పుకొంటోంది.

అయితే నేటికీ అనేక జిల్లాలలో సచివాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో చాలా వరకు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. నెలకు కనీసం 500-1,000 కోట్ల సంక్షేమపధకాలకు నిధులు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నేటికీ సచివాలయాలకు సొంత భవనాలు నిర్మించలేకపోగా కనీసం అద్దె భవనాలకు అద్దె బిల్లులు కూడా చెల్లించలేకపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇటీవల ప్రకాశం జిల్లాలో ఇండ్లచెరువు గ్రామంలో సచివాలయ భవనానికి అద్దె చెల్లించకపోవడంతో ఆ ఇంటి యజమాని తాళం వేశాడు. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో ఖాజీపేట మండలంలోని అప్పన్నపల్లె గ్రామంలో సచివాయలయానికి కూడా అద్దె చెల్లించకపోవడంతో దాని యజమాని తాళం వేసాడు. దీంతో సచివాలయం సిబ్బంది పై అధికారులకు ఈ విషయం తెలియజేసి భవనం ఎదుట చెట్టుకింద కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు.

అద్దె భవనాల కధ ఇలా ఉంటే, ప్రభుత్వ భూములు దొరకకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 1,371 ప్రభుత్వ పాఠశాలల ఆవరణలలో సచివాలయ భవనాలను నిర్మించి నడిపిస్తున్నట్లు హైకోర్టు దృష్టికి రావడంతో, వాటిని తక్షణం అక్కడి నుంచి తొలగించాలని సంబందిత అధికారులకు నోటీసు జారీ చేసింది.

కానీ వారు స్పందించకపోవడంతో విశాఖ జిల్లాలోని తిరువోలులో గల మండల పరిషత్ పాఠశాలలో సచివాలయ భవనాలు నిర్మించి, నడిపిస్తూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మార్చి 31వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారులకు ఒక్కొక్కరికీ రెండువారాలు జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించగా వారు హైకోర్టుకి క్షమాపణలు చెప్పుకొని, జైలుకి వెళ్లకుండా తప్పించుకోవలసి వచ్చింది. ఈ వార్త దేశవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది. వైసీపీ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొనే సచివాలయ వ్యవస్థ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మిగిలినవాటి పరిస్థితి ఏమిటో?

The post సచివాలయానికి తాళం: ఇదీ…ప్రభుత్వం పరిస్థితి! appeared first on mirchi9.com.