ఏపీలో జరుగుతున్న అవాంఛనీయ ఘటనలు చూస్తున్నవారు ఆశ్చర్యపోతున్నారు. వారం రోజుల క్రితం కారులో తిరుపతి వెళుతున్న ఓ కుటుంబం దారిలో ఒంగోలు పాత బస్టాండ్ వద్ద ఆగి టిఫిన్ చేస్తుండగా, సిఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌కి కారు కావాలంటూ పోలీసులు పట్టుకుపోవడం చూసి ప్రజలు షాక్ అయ్యారు.

ఆ తరువాత రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మానసిక వికలాంగురాలిని ఓ గదిలో బందించి సామూహిక అత్యాచారం చేస్తే, ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పడానికి వెళ్ళిన టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీనియర్ నేత బోండా ఉమలకు మహిళా కమీషన్‌ నోటీసులు పంపింది.

తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో 10-13 ఏళ్ళు వయసున్న ముగ్గురు మైనర్ బాలురను పోలీసులు స్టేషన్లో నిర్బందించారు. వారు ముగ్గురూ వైసీపీ ఫ్లెక్సీ బ్యానర్లను చింపారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో వారిని స్టేషన్‌కు తీసుకువచ్చామని పోలీసులు చెప్పారు. అయితే వారు మైనర్లు కనుక వారిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని, వారి తల్లితండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశామని పోలీసులు తెలిపారు.

తెలిసీ తెలియని వయసులో ఉన్న పి‌ల్లలు చిన్న పొరపాటు చేస్తే, వైసీపీ నేతలు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కూడా ఏమాత్రం ఆలోచించకుండా వారిని తెచ్చి పోలీస్‌స్టేషన్‌లో నిర్బందించడం ఏమిటని స్థానిక టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఎలాగూ భద్రత లేదు అభం శుభం తెలియని చిన్న పిల్లలు కూడా భయం భయంగా బ్రతకాలా?అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

మైనర్లను పోలీస్‌స్టేషన్‌లో బందించినట్లు జాతీయ ఛానల్ ఇండియా టుడేలో రావడంతో ఇది చూసి దేశ ప్రజలందరూ నవ్వుతారని, వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పరువు తీస్తోందని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలురని పోలీస్‌స్టేషన్‌లో నిర్బందించినందుకు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Shocker from Andhra Pradesh! Kids kept in police station for tearing YSRCP poster | #ITVideo pic.twitter.com/xgyS1HMStB

— IndiaToday (@IndiaToday) April 27, 2022

The post వైసీపీ ఖాతాలో మరో విజయం…పోలీస్‌స్టేషన్‌లో పిల్లలు appeared first on mirchi9.com.