సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దానిలో ఏమి చర్చించబోతున్నారో మీడియా ముందే ఊహించింది. ఊహించినట్లే, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా కీచులాడుకొంటూ పార్టీ పరువు, ప్రభుత్వం పరువు తీస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గట్టిగా తలంటి, విభేధాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని గట్టిగా హెచ్చరించారు.

ఎమ్మెల్యేలు తమ ‘పని తీరు’ మెరుగుపరుచుకోక వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వబోనని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలలో ఓడిపోయే వారికి టికెట్లు ఇచ్చి పార్టీకి నష్టం కలిగించుకోదలచులేదని స్పష్టంగా చెప్పారు. అటువంటివారి భారం మోయవలసిన అవసరం తనకు ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. కనుక ఇప్పటి నుంచి నియోజకవర్గాలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ మూడేళ్ళలో తన ప్రజాధారణ గ్రాఫ్ నిలకడగా ఉందని కానీ మీ గ్రాఫ్ ఏవిదంగా దిగజారుతోందో ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకొని పనితీరు మెరుగుపరుచుకోవాలని సిఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మనమే గెలుచుకోవాలనే లక్ష్యం, పట్టుదలతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని, కానీ 151 సీట్లు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తే ఇంకా తక్కువ వస్తాయని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు.

మంత్రి పదవులు లభించినవారు విర్రవీగకుండా జిల్లా వైసీపీ అధ్యక్షులు, సమన్వయకర్తలతో కలిసి పనిచేయాలని సిఎం సూచించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున జిల్లా వైసీపీ అధ్యక్షులు, సమన్వయకర్తల తరువాతే మంత్రుల స్థానం అని స్పష్టం చేశారు.

మే 10వ తేదీ నుంచి ‘గడప గడపకు వైసీపీ’ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో ప్రతీ ఒక్కరూ ప్రజల వద్దకు వెళ్ళి మన ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి వివరించి, వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

త్వరలోనే తాను కూడా జిల్లాలలో పర్యటిస్తానని, ఆ సందర్భంగా సచివాలయాల పనితీరును స్వయంగా పరిశీలిస్తానని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

మొదటిసారి ఎన్నికలలో గెలిచిన తరువాత జరిగిన తొలి సమావేశంలో పాల్గొన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా, సరదాగా మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు, ఈ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చినప్పుడు తమ కోసం ఎదురుచూస్తున్న మీడియాతో మాట్లాడకుండా ముభావంగా వెళ్ళిపోవడం గమనిస్తే సమావేశం ఏవిదంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. మీడియాతో మాట్లాడిన ఒకరిద్దరు కూడా లోపల ఇదే జరిగిందన్నట్లు చెప్పి వెళ్ళిపోయారు. కనుక ఈ కీలక సమావేశం కాస్త తలంటు కార్యక్రమంగా అలా ముగిసిందనుకోవాలేమో?

The post వైసీపీ కీలక సమావేశం అలా ముగిసింది appeared first on mirchi9.com.