ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, నీళ్ళ సరఫరా, విద్యుత్‌ కోతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ముందుగా ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా ప్రతివిమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడటం విశేషం.

మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు. పూజల అనంతరం కొత్తగా నిర్మించిన యాదాద్రి ఆలయమంతా తిరిగి చూసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను స్వామివారిని వేడుకొన్నాను. సిఎం కేసీఆర్‌ యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా పునర్నిర్మించారు. ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించినందుకు సిఎం కేసీఆర్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు.

మంత్రులు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఆలయాలను సందర్శించడం, ఆ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలకడం, వారు ప్రత్యేక పూజలు చేసుకొని స్వామివారి దీవెనలు పొందడం సర్వ సాధారణమైన విషయమే. అయితే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కూడా దక్కని ఆలయ మర్యాదలు మంత్రి బొత్స సత్యనారాయణకి లభించడం విశేషం.

కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ, తెలంగాణ మంత్రులు మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే మంత్రి రోజా హైదరాబాద్‌ వెళ్ళి సిఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకొని, ఆ విషయం గర్వంగా చెప్పుకోవడం, ఇప్పుడు మంత్రి బొత్స కేసీఆర్‌ కోసం దేవుడిని ప్రార్ధించానని చెప్పడం విశేషం.

తెలంగాణ మంత్రులు తమ వైసీపీ ప్రభుత్వ అసమర్ధతను ఎత్తిచూపుతూ చులకనగా మాట్లాడుతుంటే మన మంత్రులు తిరిగి వారినే పొగుడుతుండటం గమనిస్తే మన నేతలకు ఆత్మాభిమానం ఉందా?అని అనుమానం కలుగుతుంది. మన మంత్రుల తీరు చూస్తే తెలంగాణ మంత్రులతో వారికి ఎటువంటి విబేదాలు లేవని, వారి మద్య మంచి అండర్‌స్టాండింగ్ కూడా ఉందని అర్ధమవుతోంది. కనుక మొన్న పరస్పర విమర్శలను ఓ డ్రామాగానే భావించాలేమో?

The post మొన్న తిట్లు…అదే నోటితో నేడు దీవెనలు! appeared first on mirchi9.com.