పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బుదవారం సాయంత్రం విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ముస్లిం మత పెద్దలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. దానిలో పాల్గొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి పైన కండువా, తలపై టోపీ ధరించి వారితో కలిసి ప్రార్ధనలలో పాల్గొన్నారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్మోహన్ రెడ్డి వారితో కలిసి ఫోటోలు దిగి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు రోజా, తానేటి వనిత తదితరులు కూడా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో అన్ని మతాలవారిని సమానంగా ఆదరించి గౌరవించడం చాలా అభినందనీయమే. మన దేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయి. ఎవరి కులమతాల ఆచారాలు, కట్టుబాట్ల ప్రకారం వారు నడుచుకొంటుంటారు. కానీ మనం ఆచరించని మతం పట్ల మనకు అవగాహన ఉండదు కనుక ఆ మతాచారాలను, వారి దుస్తులను ధరించి వారిని అనుకరించడం వారిని గౌరవించడం అనిపించుకోదు…అపహాస్యం చేసినట్లే భావించవచ్చు.

అసలు ముస్లిం పెద్దలు ఏవిదంగా ప్రార్దన చేస్తున్నారో కూడా తెలియకుండా వారి దుస్తులు ధరించి వారి పక్కనే కూర్చొని ప్రార్ధిస్తున్నట్లు నటించడం వారిని అపహాస్యం చేయడం కాదా? సిఎం జగన్మోహన్ రెడ్డి ఈవిదంగా చేయడంకంటే తన ప్రభుత్వంలో మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న అంజాద్ భాషాకు ఈ బాధ్యత అప్పగించి తాను కేవలం విందులో పాల్గొంటే బాగుండేది కదా?

హిందువుల పండుగలప్పుడు హిందువులా, రంజాన్ పండుగ ముస్లింలా, క్రిస్మస్ నాడు క్రీస్టియన్‌లా నటించవలసిన అవసరం ఏముంది. అలా చేస్తే సినీ నటులకు, ముఖ్యమంత్రికి తేడా ఏముంటుంది? రాష్ట్రంలో ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు ఈవిదంగా చేయడం కంటే వారి సమస్యలను పరిష్కరించి, వారికీ అభివృద్ధి మార్గాలు చూపిస్తే సంతోషించి వైసీపీకే ఓట్లు వేస్తారు కదా?వివిద మతాల పండుగలు, పర్వదినాలలో ఆయా మతాల ప్రజలకు సిఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసి, సంబదిత మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఆయా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఇస్తే వారు కూడా చాలా సంతోషిస్తారు కదా?

The post మైనార్టీ వర్గాలకు ఎన్నికల టోపీలు…ఇఫ్తార్ విందులు appeared first on mirchi9.com.