ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తక్షణం నిర్మాణాలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని మార్చి 3వ తేదీన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే రాజదాని నిర్మాణ పనులకు ఆరు నెలలు సరిపోవు ఆరేళ్ళు పడుతుందంటూ ప్రభుత్వం చెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

నేటికీ మూడు రాజధానులకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నందునే ఈ సాకుతో రాజధానిలో నిర్మాణ పనులు మొదలుపెట్టకుండా వచ్చే ఎన్నికల వరకు కాలక్షేపం చేసేస్తే, ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆలోచిద్దాం లేకుంటే తరువాత అధికారంలోకి వచ్చేవారే చూసుకొంటారనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం ఈవిదంగా చెపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

అటు హైకోర్టు, ఇటు ప్రజలు, ప్రతిపక్షాల ఒత్తిళ్ళు భరించలేక రాష్ట్ర ప్రభుత్వం అయిష్టంగానే అమరావతిలో నిర్మాణ పనులను ప్రారంభించడంతో నత్త నడకలు నడుస్తున్నాయి. హైకోర్టు ఆదేశించి రెండు నెలలు గడిచినా ఇంతవరకు రాజధాని రైతులకు భూముల పట్టాలు ఇవ్వలేదు.

దీంతో రాజధాని రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ పిటిషన్‌ వేశారు. అమరావతిని నిర్మించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేనందునే నిధులు కొరత పేరుతో ఈవిదంగా వ్యవహరిస్తోందని కనుక ఇది కోర్టు ధిక్కారమే అని రైతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. వారి పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరుపనుంది.

రాజధాని నిర్మాణానికి నిధులు లేవని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం నెల తిరిగేసరికి వందల కోట్లు ఏదో సంక్షేమ పధకం కోసం కేటాయిస్తూనే ఉంది. సంక్షేమ పధకాలకు చెల్లించడానికి డబ్బు పుట్టించగల రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి ఏర్పాటు చేయలేకపోతోందంటే నమ్మశక్యంగా లేదు.

అయినా సీఆర్‌డీఏ చట్టంలో ఒప్పందం ప్రకారం రైతులకు భూములు అప్పగించడానికి డబ్బు అవసరం లేదు కదా?కానీ ఎందుకు ఇవ్వడం లేదు? అంటే చిత్తశుద్దిని శంఖించవలసి వస్తుంది. కనుక నేడు హైకోర్టులో మళ్ళీ మరోసారి మొట్టికాయలు వేయించుకొంటేనే కానీ ప్రభుత్వంలో కదలిక రాదేమో?

The post మళ్ళీ ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవా? appeared first on mirchi9.com.