గత ఎన్నికలలో వైసీపీకి అన్నీ కలిసి రావడం, ప్రశాంత్ కిషోర్‌ కూడా తోడ్పడటంతో చాలా సులువుగా గెలిచి అధికారంలోకి రాగలిగింది. కానీ వచ్చే ఎన్నికలలో వైసీపీకి అటువంటి అనుకూల పరిస్థితులు ఉండవని ఇప్పటికే స్పష్టం అవుతోంది. కనుక వైసీపీకి ప్రశాంత్ కిషోర్‌ అవసరం ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో ఆయన సేవలు తమకు అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేశారు. ప్రశాంత్ కిషోర్‌ చాలా అవసరం ఉన్నా ఆయన సేవలను వైసీపీ ఎందుకు ఉపయోగించుకోకూడదనుకొంటోంది? అంటే దానికి కొన్ని బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.

ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని చెప్పినప్పటికీ వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ కోసం పనిచేయబోతున్నారు. బిజెపిని అంటే…ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయనతో చేతులు కలపడమంటే కేంద్ర ప్రభుత్వాన్ని శత్రువుగా మార్చుకోవడమే అవుతుంది.

గత తమిళనాడు ఎన్నికలలో మాట వినని శశికళ పరిస్థితి ఏమయిందో అందరికీ తెలుసు. కనుక ఒకవేళ కేంద్రప్రభుత్వం కన్నెర్ర చేస్తే సిఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డికీ అదే పరిస్థితి ఎదురవవచ్చు. ఇది ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ప్రశాంత్ కిషోర్‌ సేవలను మళ్ళీ ఉపయోగించుకోవాలని వైసీపీ మొదట భావించడంతో ఆయన ఐప్యాక్ టీం రాష్ట్రంలో సర్వే చేసి ఓ నివేదిక సమర్పించింది. దానిలో తమ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, అప్పులు, మూడు రాజధానులు వంటి అంశాల కారణంగా ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అలాగే కొందరు మంత్రులు మీడియాలో అసభ్యంగా మాట్లాడుతున్న తీరుపై ప్రజలలో అసహనం, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వంటి అంశాలను కూడా దానిలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తమ పాలన అత్యద్భుతంగా సాగుతోందని గట్టిగా నమ్ముతున్న సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఆ నివేదికను జీర్ణించుకోవడం చాలా కష్టమే. కనుక ఆయనను దూరం పెట్టడానికి ఇదీ మరో కారణంగా కనిపిస్తోంది.

తమ సంక్షేమ పధకాలే తమకు శ్రీరామ రక్ష వాటితోనే వచ్చే ఎన్నికలలో మళ్ళీ గట్టెక్కిపోవచ్చుననే వైసీపీ ధీమా మరో కారణం. కనుక అవలీలగా గెలిచే ఎన్నికల కోసం ఆయనకు అనవసరంగా వందల కోట్లు ఫీజు చెల్లించే బదులు ఆ డబ్బేదో ఎన్నికలలో ఖర్చు చేస్తే సులువుగా గెలవవచ్చనే అభిప్రాయం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.

ఆయనను వద్దనుకోవడానికి ఎన్ని కారణాలునప్పటికీ, వచ్చే ఎన్నికలలోనే వైసీపీకి ఆయన అవసరం ఇంకా ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. ఆనాడు ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులను టిడిపి ముందుగా పసిగట్టలేక తమ ప్రభుత్వానికి, పాలనకు నూటికి 90 మార్కులు వేసుకొని బోర్లా పడినట్లే ఈసారి వైసీపీ బోర్లా పడుతుందేమో?

The post ప్రశాంత్ కిషోర్‌ను వైసీపీ ఎందుకు వద్దనుకుందో? appeared first on mirchi9.com.