ఏపీ మంత్రివర్గ విస్తరణ తరువాత తొలిసారిగా నేడు తాడేపల్లి సిఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగబోయే దీనిలో పాత, కొత్త మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ అనుబంద విభాగాల అధ్యక్షులు పాల్గొంటారు.

తమ వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్ళుగా చేస్తున్న సుపరిపాలన, అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం గురించి ప్రజలకు తెలియజేసి వారితో మమేకం కావడం అజెండాగా ఈ సమావేశం జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

అయితే మంత్రివర్గ విస్తరణ జరిగి రెండు వారాలవుతున్నప్పటికీ పాత, కొత్త మంత్రుల మద్య విభేదాలు, గొడవలు, మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారి అలకలు నేటికీ కొనసాగుతున్నందున, సిఎం జగన్మోహన్ రెడ్డి వారందరినీ దారిలో పెట్టి ఎన్నికల కోసం వారిని సిద్దం చేసేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు భావించవచ్చు. దానినే సజ్జల మరోవిదంగా చెప్పారనుకోవచ్చు. కనుక ఈ సమావేశం వైసీపీకి చాలా కీలకమైనదే కావచ్చు దాంతో రాష్ట్రానికి, ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే, కరెంట్ కోతలు, పెంచిన కరెంట్, బస్ ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు అన్నీ అలాగే ఉంటాయి. వాటిని ప్రజలు భరిస్తూనే ఉండాలి కనుక. చాలా కీలకమని సజ్జల చెపుతున్న ఈ సమావేశంలో కనీసం రాజధాని అమరావతిపై గట్టి నిర్ణయం తీసుకొన్నా చాలు ప్రజలు చాలా సంతోషిస్తారు.

The post నేడు వైసీపీ కీలక సమావేశం…ప్రజలకు ఒరిగేదేమిటి? appeared first on mirchi9.com.