జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మరోసారి టిడిపితో పొత్తుకి సిద్దమన్నట్లు మాట్లాడారు. ప్రస్తుతానికి బీజేపీతో స్నేహం కొనసాగుతుందని కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా సిద్దమని అన్నారు. తద్వారా బిజేపీ తమతో కలిసివస్తే సరేసరి లేకుంటే తెగతెంపులు చేసుకోవడానికి కూడా సిద్దమని పవన్ కళ్యాణ్ చెప్పేసినట్లే.

రాష్ట్రంలో ప్రజలు బీజేపీని పట్టించుకోవడం లేదు కనుకనే జనసేనతో అంటకాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ టిడిపితో పోత్తులకు సిద్దపడుతుండటంతో బిజేపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలాగ మారింది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ కోసం ఇంతకాలం తాము దూరంగా పెట్టిన టిడిపితో చేతులు కలుపలేదు. అలాగని పవన్ కళ్యాణ్ ను వదులుకోలేదు.

ఇవాళ్ళ ఏపీ బిజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు ఏలూరులో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ విలేఖరి “పవన్ కళ్యాణ్ టిడిపితో మళ్ళీ పొత్తులు పెట్టుకోబోతున్నట్లు చెప్పారు కదా? దానిపై మీ అభిప్రాయం ఏమిటి?” ప్రశ్నించినప్పుడు ఆయన కొంత అసహనంగా “ప్రస్తుతానికి జనసేన-బిజేపీ కలిసి పనిచేస్తున్నాయి. అయన ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొంటారో వెళ్లి ఆయనే అడగండి. మాకు పొత్తులపై పూర్తి స్పష్టత ఉంది. మా పార్టీ లక్ష్యం ఒకటే. ఆంద్రప్రదేశ్‌ అభివృద్ధి. ప్రధాని నరేంద్ర మోడీ చేస్త్తున్న అభివృద్ధి కార్యక్రమాలే మాకు చాలు. వాటి గురించి మేము ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడిగి గెలవగలమనే పూర్తి నమ్మకం మాకు ఉంది,” అని అన్నారు.

The post జనసేన ఎవరితో పొత్తులు పెట్టుకుంటుందో మాకేం తెలుసు? appeared first on mirchi9.com.