టిడిపి, జనసేనలు పొత్తులకు సిద్దపడుతుండటంపై వైసీపీ మంత్రులు, నేతలు సింహం సింగిల్‌గానే వస్తుంది దానిని ఎదుర్కోలేకనే ఆ రెండు పార్టీలు మళ్ళీ చేతులు కలుపుతున్నాయని, కానీ ఎన్ని పార్టీలు చేతులు కలిపినా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం ఎవరి తరం కాదని గట్టిగా వాదిస్తున్నారు.

దీనిపై టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “అవినీతి,అరాచకాలలో కంపుకొడుతున్న మీ పక్కన నిలబడాలని ఎవరూ కోరుకొంటారు?మీ పార్టీ తీరు, మీ ప్రభుత్వ తీరు చూస్తున్నవారెవరూ మీ పార్టీతో పొత్తు పెట్టుకోరు. అయినా కుక్కతోక పట్టుకొని గోదారి దాటాలని ఎవరూ కోరుకదా?మీతో ఎవరూ చేతులు కలపడానికి ఇష్టపడటం లేదు కనుకనే ‘సింహం సింగిల్‌గానే వస్తుందనే’ కొత్త పల్లవి అందుకొన్నారు. అది చూసి జనం నవ్వుకొంటున్నారు,” అని అన్నారు.

మరో 20-30 ఏళ్ళ వరకు ఏపీలో వైసీపీయే అధికారంలో ఉంటుందని, జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తారని వైసీపీ మంత్రులు, నేతలు బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసినా కూడా వైసీపీని ఓడించలేవని వాదిస్తున్నారు.

ఇంతవరకు టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొన్నట్లు ప్రకటించనే లేదు. కేవలం అవి దగ్గరవుతుంటేనే వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతూ నిత్యం వాటి పొత్తుల గురించే విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీలో నెలకొన్న అభద్రతాభావాన్ని వారి మాటలు, వాదనలు సూచిస్తున్నాయి.

తమ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని వారు భావిస్తున్నట్లయితే, వచ్చే ఎన్నికలలో వైసీపీ నిజంగానే 150 సీట్లు గెలుస్తుందనే గట్టి నమ్మకం వారికి ఉన్నట్లయితే అసలు టిడిపి, జనసేనల గురించి మాట్లాడేవారు కాదు. కానీ ఎన్నికలకి ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే పాలనను పక్కన పెట్టి రేపటి నుంచి ‘గడపగడపకు వైసీపీ’ అంటూ తిరగాల్సిన అవసరం ఏమిటి?అంటే సింహం అని చెప్పుకొంటూ వైసీపీ నేతల మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనే కదా అర్ధం?

The post కుక్క తోక పట్టుకొని గోదారి దాటాలని ఎవరూ కోరుకదా? appeared first on mirchi9.com.