నాలుగు రోజుల క్రితం శ్రీ సత్యసాయి జిల్లాలో గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి చెందింది. ఆమెపై అత్యాచారం సాదిక్ అనే వ్యక్తితో సహా మరికొంత మంది సామూహిక అత్యాచారం చేసి తరువాత చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తేజస్విని మొహం, శరేరా భాగాలపై ఉన్న గాయాలే ఇందుకు నిదర్శనమని వారు వాదిస్తున్నారు.

కానీ ఆమె మృతదేహానికి పోస్టు మార్టం జరుగక మునుపే ఆమె ఉరి వేసుకొని చనిపోయిందని, ఆమెపై ఎటువంటి అత్యాచారం జరుగలేదని ధర్మవరం డీఎస్పీ చెప్పడంతో అనుమానాలు, విమర్శలు మొదలయ్యాయి. చక్కగా బీఫార్మసీ చదువుకొంటున్న తమ బిడ్డ ఆత్మహత్య చేసుకోవలసిన ఆగత్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వారి ఒత్తిడితో ఆమె మృతదేహానికి శుక్రవారం పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో మళ్ళీ పోస్టుమార్టం చేసి ఆమెపై అత్యాచారం జరుగలేదని మరోసారి నిర్ధారించారు.

తమ బిడ్డపై హత్యాచారం జరిగితే పోలీసులు, పోస్టుమార్టం చేసిన వైద్యులు ఈ విషయాన్ని దాచిపెట్టి ఎందుకు ఆత్మహత్యగా చూపుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ బిడ్డకు అన్యాయం జరిగితే న్యాయం చేయవలసిన పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు ఈ అనుమానాస్పద మృతి కేసుపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తుండటంతో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌ ఈ కేసు పూర్వ ఫారాలు తెలుసుకొనేందుకు ఈరోజు ధర్మవరం వచ్చారు. ఆయన వాహనాన్ని తేజస్విని కుటుంబ సభ్యులు, టిడిపి, బిజెపి, జనసేన శ్రేణులు అడ్డుకొని పోలీసుల వైఖరిపై తమకు అనుమానాలున్నాయని కనుక నిష్పక్షపాతంగా మళ్ళీ దర్యాప్తు జరిపించి నిందితులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే నిందితుడు సాదిక్‌ను అరెస్ట్ చేసి అతనిపై సెక్షన్స్ 376, 420, 306 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అయినప్పటికీ ఈ కేసులో మరింత లోతుగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపేందుకుగాను ఈ కేసును దిశ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఈ ఘటనపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ స్పందిస్తూ, “తేజస్వినిపై మొదట అత్యాచారం జరుగలేదని, ఆత్మహత్య చేసుకొందని పోస్టుమార్టం చేయకముందే జిల్లా డీఎస్పీ ఏవిదంగా చెప్పారు?అప్పుడు అత్యాచారం జరుగలేదని చెప్పిన పోలీసులు ఇప్పుడు దిశ పోలీసులకు ఈ కేసును బదిలీచేశారు. అంటే నిన్న ఆత్మహత్య కేసు 24 గంటలు గడిచేసరికి హత్యాచారం కేసుగా మారిందనే కదా?

ఒక నేరం జరిగితే మీ ప్రభుత్వం నేరస్తులని పట్టుకొని శిక్షించే ప్రయత్నం చేయకుండా ఈవిదంగా నేరస్తులను కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తోంది? ఇదే మీ బిడ్డలకో మీ మంత్రుల్ అబిడ్డలకో జరిగితే అప్పుడూ మీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందా?” అని ప్రశ్నించారు.

The post ఒక్కరోజులో ఆత్మహత్య హత్యాచారంగా ఎలా మారింది? లోకేష్ ప్రశ్న appeared first on mirchi9.com.