తెలంగాణ సిఎం కేసీఆర్‌ కేవలం ఏడున్నరేళ్ళ వ్యవదిలో తన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపినమాట వాస్తవం. అదేవిదంగా దేశాన్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తానని నిన్న హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ప్లీనరీలో చెప్పారు. చిత్తశుద్ధి, పట్టుదల, దూరదృష్టి ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పారు. అవును నిజమే! అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రమే ఇందుకు సాక్ష్యం.

అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్ళ తరువాత కూడా నేటికీ పొరుగునే ఉన్న మన రాష్ట్రంతో నీళ్ళ కోసం, ఆస్తులు, నిధుల పంపకాల కోసం కీచులాడుతున్న సిఎం కేసీఆర్‌, దేశాన్ని ఉద్దరిస్తానని చెపుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఏపీ పట్ల ఇంత దురాభిప్రాయం ఉన్న కేసీఆరే ఏపీలో ‘జగనన్న ప్రతిష్టాపన’ కార్యక్రమంలో పాలుపంచుకొనడం దేనికో అందరికీ తెలుసు. తన ‘థర్డ్ ఫ్రంట్ కలలు’ నెరవేర్చుకోవడానికి సిఎం కేసీఆర్‌ ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళి ఢిల్లీ, యూపీ, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులను, విపక్ష నేతలను కలిసి వచ్చారు కానీ పొరుగునే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైపు, జగనన్న వైపు కన్నెత్తి చూడలేదు ఎందుకో?

“నాకే అన్నీ తెలుసు… నేను మాత్రమే మేధావిని…లోకంలో మిగిలినవారందరూ తెలివితక్కువవారు…” అని అనుకొనే సిఎం కేసీఆర్‌ తన అహాన్ని, బేషజాలను పక్కనపెట్టి అందరినీ కలుపుకుపోలేనప్పుడు ఇక దేశాన్ని ఏవిదంగా ఉద్దరించగలరు? అయినా సొంత రాష్ట్రంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో, ఇంతకాలం గురువుగా భావించి ఎంతో గౌరవించిన త్రిదండి చిన్న జీయర్ స్వామితోనే కేసీఆర్‌కు పొసగనప్పుడు, భిన్న రాజకీయ పరిస్థితులు, భిన్న దృక్పదాలు కలిగిన ఇతర రాష్ట్రాలలో రాజకీయ పార్టీలను ఏవిదంగా కలుపుకుపోగలరనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు ఇదంతా దేశాన్ని ఉద్దరించడానికా లేక రాష్ట్రంలో బిజెపి అడుగుపెట్టకుండా అడ్డుకొంటూ తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికా?అని ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏమైతేనేమీ, సిఎం కేసీఆర్‌ తన ఆలోచనలు, కోరికలనే ప్రజల ఆలోచనలు, కోరికలుగా అభివర్ణించుకొంటూ, దేశ ప్రజలందరూ తన నాయకత్వం కోరుకొంటున్నారని గొప్పగా చెప్పుకొంటూ ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. ఈ దేశోద్ధారకుడు సినిమా ఏవిదంగా సాగి ముగుస్తుందో?

The post ఏపీని కలుపుకుపోలేని కేసీఆర్‌ దేశాన్ని ఎలా ఉద్దరిస్తారో? appeared first on mirchi9.com.