మన జగనన్న హయంలో చివరికి పదో తరగతి పరీక్షలు కూడా వివాదస్పదంగా మారడం చాలా విడ్డూరంగా ఉంది. సాధారణంగా పదో తరగతి పరీక్షల హడావుడి మొదలైనప్పుడు ఈసారి పరీక్షలకు ఎంతమంది విద్యార్ధులు హాజరవుతున్నారు…హాల్ టికెట్స్ వచ్చాయా లేదా… పరీక్ష కేంద్రాలు, ఏర్పాట్లు, ఫలితలు వంటి వివరాలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినబడుతుండేవి.

కానీ ఈసారి పరీక్షలు మొదలవగానే ప్రశ్నాపత్రాలు లీకేజీలు, మాస్ కాపీయింగ్, ఉపాధ్యాయులు, సిబ్బంది అరెస్ట్, వారికి కోర్టు రిమాండ్ విధించడం వంటి వార్తలు వినబడుతున్నాయి. ఇవి కూడా ప్రతిపక్షాల కుట్రే అని వైసిపీ నేతలు వాదించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

అసలు ఈసారి పదో తరగతి పరీక్షలు ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారాయి? ఉప్పాధ్యాయులే దగ్గరుండి విద్యార్ధుల చేత మాస్ కాపీయింగ్ ఎందుకు చేయిస్తున్నారు? వారికి కొందరు అధికారులు, సిబ్బంది ఎందుకు సహకరిస్తున్నారు? అని ప్రజలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉపాధ్యాయులు, అధికారులపై ప్రభుత్వ ఒత్తిడే దీనికి కారణంగా కనిపిస్తోంది. ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పించామని కనుక ఈసారి పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని, లేకుంటే ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి వస్తుందని సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను గట్టిగా హెచ్చరించడంతో వారు ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచారు. కానీ కరోనా కారణంగా విద్యార్ధులు చదువులలో వెనకబడ్డారనే సంగతి ప్రభుత్వం విస్మరించింది.

విద్యార్ధుల పరిస్థితి గురించి ఉపాధ్యాయులకు బాగా తెలుసు కానీ వారిని తప్పనిసరిగా పాస్ చేయించకపోతే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుందనే భయంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఉపాధ్యాయులు తమ విద్యార్ధులందరినీ పాస్ చేసుకునేందుకు మాస్ కాపీయింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అధికారులపై కూడా తీవ్ర ఒత్తిడి ఉన్నందున కొన్ని చోట్ల వారు కూడా మాస్ కాపీయింగ్ చేయిస్తున్న ఉపాధ్యాయులకు సహకరిస్తున్నారని భావించవచ్చు. ఇంతకాలం సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు పొందుతున్న ఉపాధ్యాయులు, మాస్ కాపీయింగ్ చేయించవలసి రావడం, పట్టుబడి జైలుకి వెళ్ళవలసిరావడం చాలా బాధాకరం.

వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, ఫలితాలు సాధించాలంటూ ప్రభుత్వం వారిపై ఒత్తిడి చేయడం వలననే ఈవిధంగా జరుగుతోందని అర్థమవుతూనే ఉంది. కనుక ఉపాధ్యాయులు తప్పు చేసినప్పటికీ అందుకు వారినే నిందించడం సరికాదు. కనుక సమాజంలో వారి గౌరవ మర్యాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారిపై తక్షణమే కేసులు ఉపసంహరించుకొని, ఈ పరీక్షలకు వారిని దూరంగా ఉంచితే సరిపోతుంది.

ఈ పరీక్ష ఫలితాలు ఎలా వస్తున్నప్పటికీ ఇప్పుడు పరీక్షలను సక్రమంగా నిర్వహించి, తరువాత సప్లిమెంటరీ పరీక్షలకు సిద్దం అయ్యేందుకు విద్యార్ధులకు కాస్త ఎక్కువ సమయం ఇచ్చి నిర్వహిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాదని ఇదేవిధంగా అవకతవకలతో పరీక్షలు నిర్వహిస్తూ, ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి జైళ్ళకు పంపుతుంటే చివరికి రాష్ట్ర ప్రభుత్వమే విమర్శలు, కోర్టు కేసులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వమే నవ్వులపాలవుతుందని గ్రహిస్తే మంచిది.

The post ఎందుకీ పదో పంచాయతీ? appeared first on mirchi9.com.