ఏపీ నుంచి తెలంగాణ విడిపోతే ఎంతో కాలం నిలబడలేదని మన రాజకీయనాయకులు సర్టిఫికేట్ ఇచ్చి మరీ వచ్చారు. కానీ ఇప్పుడు మన కంటే చిన్న రాష్ట్రమైన తెలంగాణతో ఏవిదంగానూ పోటీ పడలేని నిసహాయస్థితికి తీసుకువచ్చేరు. తెలంగాణ ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేస్తూ హైదరాబాద్‌లో ఎక్కడికకడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్లు నిర్మిస్తూ, దుర్గం చెరువు వద్ద కేబిల్ బ్రిడ్జి, హైటెక్‌సిటీలో స్కై వాక్ వంటి అబ్బుర నిర్మాణాలను చకచకా పూర్తి చేస్తోంది. కానీ మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా ఎక్కడా నిర్మాణాలు చేపట్టకపోగా కూలిపోవడానికి సిద్దంగా ఉన్న, గోతులు పడిన వంతెనలపై నుంచే భారీ వాహనాలు, బస్సులు, కార్లు, ఆటోలు, బైకులు ప్రయాణించవలసి వస్తోంది.

ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కదిరి-బెంగళూరు మద్య మిట్టపల్లి సోమావతి నదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన కూలిపోతున్న వంతెనను ఓ సారి చూడాల్సిందే! నిజానికి ఈ వంతెన ఎప్పుడో శిధిలావస్థకు చేరుకొంది. ఇప్పటికే కొంత కూలిపోయింది కూడా. మిగిలింది ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ఉంది. కనుక దీనిని ఎప్పుడో కూల్చివేసి దీని స్థానంలో కొత్త వంతెన నిర్మించవలసి ఉంది. కానీ నిధులు కేటాయించకపోవడంతో రోడ్లు భవనాల శాఖ అధికారులు, పాక్షికంగా కూలిపోయిన చోట ఇసుకబస్తాలు పేర్పించగా, ఏ క్షణంలోనైనా కూలిపోయేందుకు సిద్దంగా ఉన్న ఆ వంతెనపై నుంచే భారీ సిమెంట్ లోడుతో వెళ్ళే లారీలు, బస్సులు కార్లు ప్రయాణిస్తున్నాయి. ఆ గోతులలో పడుతూ లేస్తూ ఆటోలు, ద్విచక్రవాహనాలు సైతం ప్రయాణిస్తున్నాయి.

ఈ వంతెన పరిస్థితిపై అధికారులను ప్రశ్నించగా, దీనిని కలుపుతూ నాలుగు లేన్లతో కొత్తగా హైవే రోడ్డు వస్తోంది కనుక ఇది కూడా నేషనల్ హైవే ఆధారిటీ కిందకు వెళుతుందని తెలిసి ఆగామని చెప్పారు. కానీ ఆలోగా వంతెన మరమత్తుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని నిధులు మంజూరు కాగానే మరమత్తులు ప్రారంభిస్తామని చెప్పారు.

అయితే ఆ హైవే రోడ్డు పనులు ఎప్పుడు మొదలవుతాయో, నిధులు ఎప్పుడు మంజూరు అవుతాయో ఎవరికీ తెలియదు. ఆలోగా వాహనాలు వెళుతున్నప్పుడు వంతెన కూలిపోతే, దిగ్బ్రాంతి, సంతాప ప్రకటనలు, తరువాత ఎక్స్‌గ్రేషియా ప్రకటనలు వినిపించడం మాత్రం తద్యం.

The post ఇక్కడ కూలుతున్న పాత వంతెనలు…అక్కడ కొత్త ఫ్లైఓవర్లు appeared first on mirchi9.com.