సీట్ల కోసం, అధికారం కోసం తెలుగు జాతికి కాంగ్రెసు, బిజెపి, టిడిపి, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు.. ఇలా అన్ని పార్టీలు నష్టం కలిగించాయని, విభజనలో పాలు పంచుకున్నాయని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. సీట్లు, అధికారం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. పార్లమెటులో పెట్టిన బిల్లులో తాను లేవనెత్తిన లోపాలు అనేకం ఉన్నాయన్నారు. విభజన వల్ల రెండు ప్రాంతాలకు నష్టం జరుగుతుందన్నారు.
విభజన బిల్లును టేబుల్ ఐటంగా తీసుకు రావడమేమిటన్నారు. బిల్లును చదువుకునేందుకు కూడా ద్రమంత్రులకు సమయం ఇవ్వలేదని దుయ్యబట్టారు. విభజన జరిగినప్పుడు ప్రజలకు మేలు జరగాలని కానీ, ఈ విభజన వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. రైతులు, విద్యార్థులు, యువకులు… ఇలా అందరికీ నష్టమే అన్నారు. అన్ని పార్టీలు తెలుగు జాతికి నష్టం చేశాయన్నారు. 59 ఏళ్లలో ఎన్నో రంగాల్లో తెలంగాణ, సీమాంధ్రల మధ్య అనుబంధం ఏర్పడిందన్నారు. విభజన నిర్ణయంలో ప్రతి అంశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయన్నారు.
విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందన్నారు. విభజన విషయంలో సంప్రదాయాలు పాటించలేదన్నారు. జివోఎం ఏర్పాటు, జివోఎం నిర్ణయాలు అన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలేనని కిరణ్ రెడ్డి నిప్పులు చెరిగారగు. సభలో కొట్టడమా? పార్లమెంటులో సహచర ఎంపీలే సీమాంధ్ర ఎంపీలను కొట్టడమేమిటని ప్రశ్నించారు. ఏ రాష్ట్ర విభజన జరుగుతుందో ఆ రాష్ట్ర ఎంపీలను ఎలా సస్పెండ్ చేసి చర్చిస్తారని ప్రశ్నించారు. దొంగల్లా ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి బిల్లుకు లోకసభ ఆమోదం తెలపడం ఎంత వరకు సమంజసమన్నారు. భారత దేశ చరిత్రలో ఇప్పటి వరకు అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టలేదన్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా బిజెపి మద్దతివ్వడం దురదృష్టకరమన్నారు.
కాంగ్రెసు, బిజెపి చీకటి ఒప్పందానికి తెలుగు హృదయాలు గాయపడ్డాయన్నారు. కేంద్రంతో బిజెపి చీకటి ఒప్పందం చేసుకుందన్నారు. ప్రధానికి కౌంటర్ ఎంపీలు వెల్లోకి వెళ్తేనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హృదయం గాయపడితే, రాష్ట్ర విభజనతో పదికోట్లమంది తెలుగు ప్రజల హృదయాలను గాయపర్చడం ఎంత వరకు సమంజసమన్నారు. తెలుగు జాతిని నిలువునా చీలుస్తున్నందుకు ప్రధానికి బాధ లేదా అన్నారు.